రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్

రేపటి నుండి సినిమా షూటింగ్ లు బంద్. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం.. ఓటీటీల్లో సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం..పెద్ద హీరోల రెమ్యునరేషన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు హద్దులు దాటడం..దీంతో సినిమా బడ్జెట్ కూడా నిర్మాతలు కంట్రోల్ చేయలేని పరిస్థితులు తలెత్తడం.. వంటి పలు కారణాలతో చాలా రోజులుగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ సెట్ అయ్యాకే సినిమా షూటింగ్ లు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రేపు (ఆగష్టు 1) నుండి సినిమా షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే వరకు షూటింగ్‌లు జరగవు. దీంతో సినిమా షూటింగ్‌ లు అన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉండగా, మరికొన్ని చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.

మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఈసీ మెంబర్స్‌కు ఓటు హక్కు ఉండగా 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి. ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేసింది ఫిలిం ఛాంబర్.