వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ వరుస శుభవార్తలు అందిస్తూ..ప్రతిపక్ష పార్టీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దళిత బంధు , బీసీ బంధు , మైనార్టీ బంధు లను తీసుకొచ్చిన కేసీఆర్..ఇక ఇప్పుడు వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు.

సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. వీఆర్ఏల అర్హతను బట్టి వారిని మొత్తం నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, పురపాలకశాఖలో సర్దుబాటు చేయడమే కాదు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.