భారీ వర్షాలు..నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

telangana-rains-all-exams-in-telangana-have-been-postponed-due-to-heavy-rains

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల దాటికి అన్ని విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ బుధ, గురు వారాలు సెలవులు ప్రకటించింది. దీంతో ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. అలాగే ఈ రెండు రోజుల్లో ఓయూతోపాటు జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు యూనివర్సీటి పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు, రేపు (జులై 26, 27 తేదీల్లో) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.