ప్రీతీ కుటుంబానికి రూ.30 లక్షలు ప్రకటించిన రాష్ట్ర సర్కార్..అలాగే ఒకరికి ఉద్యోగం

సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడిన కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతీ..ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రూ. 30 లక్షల తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి..సీనియర్ వేదింపులు తట్టుకోలేక బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను నిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందజేస్తూ వస్తున్నప్పటికీ , ఆమె బాడీ చికిత్స కు సహకరించలేదు. డాక్టర్స్ ఎంతో ట్రై చేసినప్పటికీ , ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరికి ఆదివారం రాత్రి 9 గంటల 15 నిమిషాలకు మృతి చెందింది.

ప్రీతి మృతి తర్వాత అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించకుండా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు అంగీకరించడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఈ ఉదయం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో వారు తమ స్వస్థలమైన జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.

ఆమె డెడ్ బాడీని చూసిన తండావాసులు, బంధువులు బోరున విలపించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ప్రీతి మృతితో తండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల సెక్యూరిటీతో నిండిపోయాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికాసేపట్లో ప్రీతీ అంత్యక్రియలు జరపనున్నారు.