నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాలకు సంబదించిన ఎన్నికల షెడ్యూల్ ఈరోజు మధ్యాహ్నం విడుదల కాబోతుంది. తెలంగాణతో పాటు చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ ఐదురాష్ట్రాల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటివారంలోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఇప్పటికే చెప్పుకొచ్చాయి.

తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండగా.. చత్తీస్ గఢ్ లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియనుండటంతో తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 జనవరిలో వేరు వేరు తేదీల్లో ముగుస్తాయి.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండదు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి ముగిసేంత వరకు ప్రభుత్వం ఎలాంటి హామీలు కానీ, పథకాలను కానీ ప్రవేశపెట్టేందుకు వీలుండదు.