చంద్రయాన్-3 ల్యాండింగ్..స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు

telangana-education-department-telecasting-chandrayaan-3-landing-live-for-students-on-august-23

హైదరాబాద్‌ః చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ అద్భుతాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపిస్తామని చెప్పారు.

చంద్రయాన్-3 ల్యాండింగ్ ను లైవ్ లో అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులు, యువత దీనిని చూడాలని విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.