ఈ నెల 23న మేడారానికి గవర్నర్, సీఎం

ఈనెల 23న గవర్నర్ తమిళిసై, CM రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. జాతర సందర్భంగా వారు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక గవర్నర్, సీఎంతో పాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది.

ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.