ద్రౌపదీ ముర్ముకు ఓటువేసినట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఎమ్మెల్యే సీతక్క

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఓటు వేయబోయి పొరపాటున బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఓటు వేశారని జరుగుతున్న ప్రచారాన్ని సీతక్క ఖండించారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వ్యక్తినని, ప్రాణం పోయేంతవరకు కూడా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, పనిచేస్తున్న పార్టీకి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

తనపై పనిగట్టుకుని చేస్తున్న ఇటువంటి ప్రచారాన్ని దయచేసి ఎవరూ నమ్మొద్దు అంటూ సీతక్క పేర్కొన్నారు. తాను ఓటు వేసే క్రమంలో మార్కర్ గీత పేపర్ పైన పడింది కానీ, ఎన్డీఏ అభ్యర్థి దగ్గర కాదని, పేపర్ పైన గీత పడిన కారణంగా, ఓటు చెల్లుతుందా లేదా అన్న అనుమానంతో తాను ఎన్నికల అధికారిని మరొక బ్యాలెట్ పేపర్ ఇవ్వవలసిందిగా కోరానని సీతక్క తెలిపారు. గంట సేపు బ్యాలెట్ పేపర్ ఇవ్వకుండా తాత్సారం చేసిన ఎన్నికల అధికారులు, అదే బ్యాలెట్ పేపర్ తో ఓటు వేయించుకున్నారు అని, అయితే తాను తన పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశానని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. అదే విధంగా తన వ్యక్తిత్వాన్ని, కష్టపడి పనిచేసే తత్వాన్ని కించపరచకూడదు అని అందరినీ కోరుతున్నానని సీతక్క అన్నారు.