రెండేళ్ల తర్వాత యాదగిరి గుట్ట పైకి ఆటోల అనుమతి

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహస్వామి (Sri LakshmiNarsimha Swamy) కొండపైకి ఆటోలను (Auto) అనుమతించింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (birla ilaiah) ఆదివారం జెంగా ఊపి ఆటోలను పైకి అనుమతించారు. గత ప్రభుత్వం మార్చి 29, 2022 నుంచి కొండపైకి ఆటోల రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయం పునరుద్ధరణ తర్వాత కొండపైకి ఆటోలకు అనుమతి నిరాకరించి.. గత ప్రభుత్వం ఫ్రీగా ఆర్టీసీ బస్సులను మాత్రమే నడిపించింది. దీంతో ఆటోలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నారు.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. జిల్లా కలెక్టర్‌ హన్మంత్‌ కే జెండగే, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీసీపీ రాజేశ్‌చంద్ర, యాదాద్రి దేవస్థాన ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పుర అధ్యక్షురాలు సుధ, ఎంపీపీ చీర శ్రీశైలంతో కలిసి కొండపైకి ఆటోల రాకపోకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని పేర్కొన్నారు. కొండపైన చలువ పందిళ్లు, డార్మిటరీ హాల్‌ ప్రారంభం, కొబ్బరి కాయలు కొట్టే ఏర్పాటు తదితర అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ నెలాఖరులోగా ఇవన్నీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.