మరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ కేబినెట్ మీటింగ్

మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశం మొదలుకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో 36 అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ అజెండా ఖరారు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రుణాలు సమీకరించుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించాలనే విషయంపై మంత్రివర్గం చర్చించనున్నది. దీంతోపాటుగా వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏండ్లకు తగ్గింపు, డయాలసిస్‌ పేషంట్లకు ఆసరా, అనాథ పిల్లల సంరక్షణకు పాలసీ, స్వతంత్య్ర వజ్రోత్సవాల వేళ సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదల, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశమున్నది.

ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కీలక అధికారులతో చర్చించారు. సుదీర్ఘంగా సాగే కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ సహచరులతో చర్చించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.