ఫ్రీడమ్ రన్‌ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి

హైదరాబాద్ః వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌ను మంత్రి సబితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె పల్లెన, పట్టణాల్లో ఫ్రీడమ్ రన్ విజవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేళ పరుగు పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ 75 వసంతాలు పూర్తిచేసుకున్న శుభ సమయంలో.. రాష్ట్రంలో 15 రోజులపాటు సంబురాలు, దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారీగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ప్రభుత్వ పథకాలు పేదల చెంతకు చేరినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు అందినట్లు సీఎం కేసీఆర్ భావిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర ప్రజల చిరునవ్వుకు కారణమవుతున్నారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మ గాంధీజీ చేసిన పోరును రానున్న తరాలు గుర్తుపెట్టుకునేలా గాంధీజీ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా చూపిస్తున్నామన్నారు. ప్రజలందరికి ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సరూర్ నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకంతో రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయానంద్, ఎగ్గె మల్లేశం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/