ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ

పూర్తయిన బడ్జెట్‌ ప్రసంగం..శాసనసభ వాయిదా

telangana-budget-2023-live-updates

2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

మార్చి నాటికి 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి

సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని రూ. 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్‌ మహానీయుని విగ్రహం యావద్దేశానిఇక గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

ఉద్యోగుల సంక్షేమం

రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కన్నా మన ఉద్యోగుల మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్‌ వాడీ, ఆశా, ఇంకా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వటం.. దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం.

ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వామ్యులుగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది.

అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు

లోకల్‌ కేడర్ల ఏర్పాటు మరియు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగంలోని 371 (ఢీ ) ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పట్టుదలతో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ కోసం ప్రత్యేకంగా సాధించారు. ఈ ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం ఇది.

కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ. 1000 కోట్లు

2014 జూన్‌ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41,735 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు కొత్తగా 2022 మార్చి నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటి ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీత భత్యాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు అదనంగా ప్రతిపాదించడమైనది.

ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ

ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ చేయబోతున్నాం. సెర్ఫ్‌ ఉద్యోగుల పేస్కేల్‌ సవరణ కూడా చేయబోతున్నాం.

2023-24 బడ్జెట్‌ అంచనాలు ఇవి..

2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.2,90,396 కోట్లు. ఇందులో రెవ్యెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ప్రతిపాదిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత శాసనసభ వాయిదా పడింది. బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.