తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా

శాస‌న‌స‌భ, శాస‌న మండ‌లి స‌మావేశాలు బుధ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం శాస‌న‌స‌భను బుధ‌వారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను వాయిదా వేశారు.

బడ్జెట్ పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వగా.. సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ నెల 8న బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. 9,10, 11 తేదీల్లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. 12వ తేదీన ద్రవ్య వినిమ‌య బిల్లును ఆమోదించ‌నున్నారు. అనంత‌రం స‌మావేశాలు వాయిదా ప‌డనున్నాయి. ఈ నెల 3వ తేదీన బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.