ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది తెలంగాణ విద్యార్థులు

న్యూఢిల్లీ: యుద్ధభూమి ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే ‘ఆపరేషన్ గంగ’ వేగంగా సాగుతోంది. రొమేనియా, హంగేరి దేశాల మీదుగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని భారత విద్యార్థులను ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో భారత ప్రభుత్వం తరలిస్తుండగా, వచ్చినవారిలో తెలుగువారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించే పనిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్లు చురుగ్గా పనిచేస్తున్నాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి మొత్తం 3 విమానాలు భారత్ చేరుకోగా, అందులో రెండు ఢిల్లీకి, ఒకటి ముంబైకి చేరుకుంది. అలాగే హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీ చేరుకుంది.

శనివారం రాత్రి ముంబై చేరుకున్న విమానంలో 14 మంది, ఆదివారం ఢిల్లీ చేరుకున్న 3 విమానాల్లో కలిపి మొత్తం 25 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులను అధికారులు గుర్తించారు. వారందరినీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు తరలించి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ భవన్ అధికారులు, అనంతరం వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌కు టికెట్లు బుక్ చేసి పంపిస్తున్నారు. అక్కణ్ణుంచి విద్యార్థులను వారి ఇళ్ల వరకు చేర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలుగు విద్యార్థులను గుర్తించే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నారు.

‘ఆపరేషన్ గంగ’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతీయుల తరలింపు కార్యక్రమంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం తో అనునిత్యం సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ చేరుకునే విమానాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులను గుర్తించి, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇందులో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కూడా 24 గంటలూ పనిచేస్తోందని వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/