బుకారెస్ట్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఐదవ విమానం

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. 249 మంది భారతీయులతో చేరుకున్నవిమానం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగ పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగింది. వీరిలో తెలంగాణకు చెందిన 11 మంది విద్యార్థులు ఉన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలింపునకు ‘ఆపరేషన్‌ గంగ’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం బుకారెస్ట్‌ నుంచి మొదటి విమానంలో 219 మంది ముంబై ఎయిర్‌పోర్టుకు, ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు 250 మందితో కూడిన రెండో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నది. మరో రెండు విమానాల్లో కూడా భారతీయులను తరలించారు. ఇప్పుడు ఐదో విమానం ఢిల్లీకి వచ్చింది. ఉక్రెయిన్‌లో 13వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరో వైపు క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆనందం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం తమకు చాలా సాయం చేసింది. భారత రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది. సరిహద్దు దాటడమే ప్రధాన సమస్యగా మారింది. అక్కడ ఉన్న భారతీయులు అందరూ తిరిగి వస్తారని ఆశిస్తున్నా. ఉక్రెయిన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారు’ అని ఓ ప్రయాణికులురాలు చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/