ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రెండు రోజుల విరామం అనంత‌రం సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. ద‌ళిత బంధు ప‌థ‌కం, హైద‌రాబాద్‌లో చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌, ప్ర‌పంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం, హైద‌రాబాద్‌లో ఈగ‌లు, దోమ‌ల బెడ‌ద‌, రాష్ట్రంలో వంతెన‌ల మంజూరు, షాద్‌న‌గ‌ర్‌కు ఐటీఐ త‌ర‌లింపు అంశంపై ప్ర‌శ్నోత్తారాల్లో చ‌ర్చించ‌నున్నారు.

ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల చ‌ట్టాన్ని స‌వ‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వు ప్ర‌తిని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉభ‌య‌స‌భ‌ల ముందు ఉంచుతారు. చెక్‌డ్యాంల నిర్మాణం, ఆదిలాబాద్ జిల్లాలో ఆల‌యాల అభివృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్ప‌త్తి, ఆరోగ్య శ్రీ బ‌కాయిల చెల్లింపులు, విద్యుత్ ఉత్ప‌త్తి వినియోగం, గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు నిధులు కేటాయింపు అంశాల‌పై మండ‌లి ప్ర‌శ్నోత్త‌రాల్లో చ‌ర్చించ‌నున్నారు. శాస‌న‌స‌భలో ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన త‌ర్వాత రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం, పాత‌బ‌స్తీలో అభివృద్ధి ప‌నుల‌పై స్వ‌ల్పకాలిక చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. టౌటింగ్ బిల్లుతో పాటు జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై స‌భ‌లో చ‌ర్చించ‌నున్నారు. శాస‌న‌స‌భ శ‌నివారం ఆమోదించిన నాలుగు బిల్లుల‌పై నేడు మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. హ‌రిత‌హారంపై కూడా మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/