తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం..సింగ‌రేణిని కాపాడుకుంటామని తేల్చి చెప్పిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశం గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. బుధువారంతో బడ్జెట్‌ పై చర్చ ముగిసింది. ఈ రోజు ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ను భగ్నం చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి సింగ‌రేణిని కాపాడుకుంటామ‌ని శాస‌న‌స‌భ‌లో అన్నారు.

సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. నాలుగు బొగ్గు గ‌నులు త‌మ‌కే ఇవ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. కానీ నాలుగు బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్నాం.. అందులో పాల్గొన‌చ్చ‌ని కేంద్రం చెప్పింద‌ని కేటీఆర్ తెలిపారు. సింగ‌రేణిని కార్మికులంద‌రికీ మాటిస్తున్నాం.. అవ‌స‌ర‌మైతే ఎంత దూర‌మైనా పోతాం. సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న కేంద్రం కుట్ర‌ను భ‌గ్నం చేస్తాం. కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం. బ‌య్యారం విష‌యంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట త‌ప్పింది. బ‌య్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవ‌ని కేంద్ర మంత్రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అలాగే 2004 నుంచి 2014 వ‌ర‌కు ఇసుక‌పై రూ. 39 కోట్ల 40 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింది. కాంగ్రెస్ హ‌యాంలో సంవ‌త్స‌రానికి 4 కోట్లు కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో.. ఇప్పుడు ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వ‌స్తుంది. ఇసుక పాల‌సీని ఇత‌ర రాష్ట్రాల అధికారులు అధ్య‌య‌నం చేస్తున్నారని తెలిపారు.