ఉపాధ్యాయుడు నిత్య చైతన్యశీలి

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

Sarvepalli Radhakrishnan
Sarvepalli Radhakrishnan

ఉపాధ్యాయ వృత్తి ని మిగిలిన డాక్టర్లు,ఇంజినీర్లు, లాయర్ల మాదిరిగా ఒకవృత్తికాదు. ఉపాధ్యాయవృత్తిలో శూన్యంలో నుంచి అనంతాన్ని చూసే ఒక బృహత్తర కార్యక్రమం.

ఒక సమాజాన్ని తరగతి నుంచి తయారు చేయడం.అందుకే ఫాలోపెయిర్‌ అనే మహాపాధ్యాయుడు ‘ఉపాధ్యాయుడు ఒక సాంస్కృతిక కార్యకర్త అంటారు.

రాబోయే సమాజానికి ఒక కొత్త సంస్కృతిని అందించే వ్యక్తిఉపాధ్యాయుడు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు ఒక కళాకారుడు. తరగతి గదిలో మార్పును బోధనతో తీసుకురావాలి. అందుకు ప్రధాన సాధకుడు ఉపాధ్యాయుడు.

అందుకే అంబేద్కర్‌ అన్నట్లు ‘విద్య ద్వారా సమాజ పరివర్తన తీసుకురావాలి సమాజ పరివర్తనను తరగతి గది నుంచి జరిపే సామాజిక శాస్త్రవేత్త ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయున్ని సోషల్‌ ఇంజినీర్‌ అంటారు.

ఈ లక్ష ణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని గత తరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఆదర్శపురుషులు, మహానుభావ్ఞలు మహాత్మజ్యోతి బాఫూలే, సావిత్రిబాయిఫూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఎపిజె అబ్దుల్‌ కలాం వంటివారు ముందువరసలో ఉన్నారు.

వీరిలో సామాన్య ఉపాధ్యాయవృత్తిని చేపట్టి ఉపరాష్ట్రపతి, భారత అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన రాధాకృష్ణన్‌ గారిజయంతి సందర్భంగా వారి గౌరవర్థాం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం.

రాధాకృష్ణగారు 1888 సెప్టెంబరు ఐదున ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తని అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు.

పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే చురుకైన వ్యక్తి.21 సంవత్సరాలకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు.

కోల్‌కతా, బెనరాస్‌, మైసూర్‌ యూనివర్శిటీలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయనంటే విద్యార్థులకు ఎంతో ఇష్టం.

మైసూర్‌ యూనివర్శిటీ నుండి బదిలీ అయినప్పుడు ఆయనను విద్యార్థులు స్వయంగా గుర్రం బండిని లాగి రైల్వేస్టేషన్‌ వరకు తీసుకువచ్చి సాగనంపారు అంటే ఆయన పట్ల విద్యార్థులు ఎంత ఆదరాభిమానాలు కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

రాధాకృష్ణ గారు తత్త్వవేత్తగా, భారత రాయబారిగా, విద్యాసంస్కరణల కమిటీ ఛైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు, రాష్ట్రపతిగా ఉత్తమ సేవలందించినందుకుగాను 1954లో భారతరత్న అవార్డును సైతం అందుకున్నారు.

వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అనుమతిని కోరగా, నిరాకరించి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించిన పిదప భారతప్రభుత్వం 1969 నుండి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.

ప్రాచీన కాలంలో ఉపాధ్యాయుడు ఆశ్రమాలలో విద్యార్థులతో కలిసి జీవి స్తూ భిక్షాటన ద్వారా మనుగడ సాగిస్తూ విద్యను నేర్పించేవారు.

10,12 సంవత్సరాల తర్వాత యుక్త వయసు రాగానే విద్యాభ్యా సాన్ని ముగించి ఇంటికి పంపి జీవితంలో స్థిరపడే విధంగా పరి పూర్ణ మానవ్ఞనిగా తీర్చిదిద్దే వారు. ఈ కాలంలోనే విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల భక్తిశద్ధ్రలు కలిగి ఉండే వారు.

ఇక స్వాతంత్య్రానంతరం భారత ఏలికలు పరాయి పాలనలో ఏ విధంగా విద్య ను అందించడానికి, వాళ్లకు పనికివచ్చే గుమస్తాగిరిని వెలగపెట్టేందుకు అవసరమైన విద్యను అందించినట్లే అదే విద్యావిధానాన్ని అమలుపరుస్తూవస్తున్నారు.

1948- 49లో నియమింపబడిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కమిషన్‌ నుండి నేటి కస్తూరిరంగన్‌ నివేదిక వరకు పలు కమిటీలు మూడు జాతీయ విద్యావిధానాలు అమలుపరిచినను ఉపాధ్యాయుని అంత స్తులో, హోదాలో మార్పులేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

ఉపాధ్యాయుని సంక్షేమం కోసం ప్రజా విద్య బలోపేతం కోసం చేసింది తక్కువ.

ప్రజలకు విద్యను ఆరోగ్యాన్ని అందించే సామాజిక బాధ్యతల నుండి ప్రభుత్వాలు తప్పుకునేందుకు లాభా పేక్షకోసం వ్యాపార అభివృద్ధికి చేసింది ఎక్కువ.

1990 తర్వాత నూతన ఆర్థిక సరళీకృత విధానాలు అమలుపరచడం ప్రారంభమ య్యాక విద్య పక్తు వ్యాపార సరుకుగా తయారైంది.

ఫలితంగా ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దిగజారింది. చదువ్ఞకునే హక్కు కాస్త చదువ్ఞకొనే హక్కుగా తయారవడంతో నాణ్యత విషయం ముందుకు వచ్చింది.

విద్య అంగడి సరుకుగా మారడంతో ఉపాధ్యా యుల గౌరవ ఆదరాభిమానాలు మసకబారడం మొదలైంది.

దీనికితోడు ప్రపంచీకర, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో విద్యారంగంలో పెను మార్పులు సంభవించి ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంతో ఉపాధ్యాయుల సామాజిక హోదా సమాజంలో పేరు ప్రఖ్యాతులు తగ్గుతూ వస్తున్నాయి.

విద్యను అందించే విషయంలో నవ సమాజాన్ని నిర్మించే విషయంలో జాతీయ నిర్మాతగా భావించే ఉపా ధ్యాయుడికి స్వేచ్ఛలేకపోవడం మూలంగా తరగతిగదిలో రకరకాల ప్రయోగాలు,ఎపెడ్‌, డిపెప్‌, క్లిప్‌, క్లాప్‌, కిప్‌, ల్యాప్‌,ఎల్‌ఇపి, ఖాళీకరో, సర్వశిక్ష అభియాన్‌, నేటి సిసిఇ వరకు పలు పథకాలు అమలుపరచడంలో విద్య అభివృద్ధి మాట అటుంచితే సమాజం లో విలువల సంక్షోభంతోపాటు ఉపాధ్యాయుని కీర్తి ప్రతిష్టలు దిగజారడం జరుగుతుంది.

దీంతో సమాజంలో అపసవ్యమైన పనులు పెరుగుతున్నాయి.పిల్లలకు మితిమీరినస్వేచ్ఛ లభించింది. వారిని సరైన దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయునికి అధికారాలు లేకుండాపోయాయి.

తప్పు చేస్తే దండించి, మందలించి, తన తప్పును తాను తెలుసుకునేవిధంగా తీర్చిదిద్ది మంచి పౌరులను అందించే అవకాశాలు మృగ్యం అయ్యాయి.

ఉపాధ్యాయుని చేతిలో బెత్తం లాగడంతో సమాజంలో శాంతిభద్రతలు అలజడి ఎక్కువైంది.

సమాజంలో మంచి చెడులకు తేడా లేకుండా యువత పెడధోరణిని అనుసరించి సభ్యసమాజం తలదించుకునేలా పలు అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. రక్షకభటుల లాఠీకి, తూటాకు పని ఒత్తిడి పెరిగింది.

మొక్కై వొంగనిది మానైవంగునా అన్నట్లు చిన్న వయసులోనే పాఠశాల ప్రాయంలోనే విద్యార్థులలో ఉన్న అపసవ్యధోరణితో కూడిన ప్రవర్తనను సరి చేయడం జరిగితే సమాజం ఆదర్శంతంగా నీతి నిజాయితీలకు నిలువుట్టదంగా విలసిల్లడానికి ఆస్కారం ఉండేది.

విద్యాభివృద్ధికి శ్రమజీవుల వారసులకు విద్యా ఆయుధాన్ని అందించేందుకు కృషి చేస్తున్న వారు ఉపాధ్యాయులు.

ఉపాధ్యాయులకు న్యాయంగా వచ్చే ఆర్థికసౌకర్యా లు అందించకుండా పలు రకాలుగా ఇబ్బందులు కలుగ చేస్తూ పనిచేయకుండానే వేతనాలు పొందుతున్నారనే దుష్ప్రచారం చేస్తూ తమ వైఫల్యాలను కల్పిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయలోకాన్ని బదనాం చేయడంతో ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఏహ్య భావం ఏర్పడింది.ఉపాధ్యాయుడు నిత్య చైతన్యశీలి.

ఉపాధ్యాయుల సంక్షేమంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయున్ని ప్రభుత్వాలు అధమస్థాయిలోకి నెట్టడం సమాజ ప్రగతికి విరోధం.

యునెస్కో వంటి ప్రపంచ అత్యున్నత సంస్థ ఉపాధ్యాయుడి అంతస్తు, హోదాను అత్యున్నతంగా ఉంచాలని సూచించింది.

జర్మనీ వంటి అభివృద్ధిచెందిన దేశాలలో దేశ అత్యున్నత పదవి తర్వాత పాధ్యాయుడికి సముచితస్థానం కల్పిం చినట్లు మనదేశంలో కూడా ఉపాధ్యాయులు గౌరవింపబడాలి.

  • తండ సదానందం

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/