ఆదిపురుష్ డైరెక్టర్ ఫై చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

ఆదిపురుష్ డైరెక్టర్ ఓం..మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండ ఫై పబ్లిక్ గా హీరోయిన్ కు కిస్ పెట్టి వార్తల్లో నిలిచారు. దీనిపై యావత్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి ఆలయ ఆవరణలో పేక్, హగ్ లాంటివి చేయడం సరైన పద్ధతి కాదంటూ వారిపై మండిపడుతూ… దీనిపై ఓం రౌత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా దీనిపై చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్పందించారు. ”తిరుమల కొండపైన ‘ఆదిపురుష్’ చిత్ర బృందం దర్శనానికి వెళ్ళారు. సంతోషం! స్వామి వారి దర్శనం అనంతరం సీతమ్మ పాత్ర పోషించిన అమ్మాయి, దర్శకుడు బయటకు వచ్చారు. స్వామి వారి శేష వస్త్రం ధరించి కౌగిలి, చుంబనం! అది మనసుకు ఆందోళన కలిగించే విషయం. తిరుమల కొండపైన ఇటువంటి వికారమైన చేష్టలు చేయకూడదు. సమ్మతం కాదు” అని సీఎస్ రంగరాజన్ మండిపడ్డారు.

తిరుమల కొండపై కొన్ని నియమాలు పాటించాలని సీఎస్ రంగరాజన్ సూచన చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ”భక్తి, ఆలోచన నియమాలు ఉండాలి. స్వామి వారి తిరుమల కొండకు భార్యాభర్తలు కలిసి వచ్చినా సరే… కళ్యాణోత్సవంలో పాల్గొన్నా కూడా… ఆలోచనా విధానంలో జాగ్రత్త పడతారు. వేరే వికారమైన ఆలోచన రాకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. అటువంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగలించుకుని, చుంబనం చేయడం దారుణమైన కార్యక్రమం. సాధారణంగా ఇటువంటి విషయాలు మాట్లాడాలని నేను టీవీ ఛానల్స్ ముందుకు రాను. కానీ, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావుడు రాములు వారి పాత్ర పోషించినప్పుడు వాళ్ళను దైవ సమానులుగా ప్రేక్షకులు చూశారు. వాళ్ళూ అంతే భక్తి శ్రద్దలతో ఉన్నారు. ఆ విధంగా నడుచుకోవాలి. సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు” అని అన్నారు.

తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తామని, అటువంటి ప్రదేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్న చోట అటువంటి పనులు (ముద్దులు, హగ్గులు) ఏమిటని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పనులు సీతారాములను అవమానించడమే అని ఆయన చెప్పుకొచ్చారు.