మూడు రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు..

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షం దంచికొడుతున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

శుక్ర‌వారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు జీహెచ్ఎంసీ ప‌రిధిలో భారీ వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు కూడా ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం ఆరు గంటల నుండి వర్షం భారీగా పెరగడం తో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. గ్రేట‌ర్‌కు ఇప్పటికే రెడ్‌ అల‌ర్ట్ హెచ్చ‌రిక‌లు జారీ చేయగా.. రాగాల మూడు రోజులు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న నేప‌థ్యంలో అత్య‌వస‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111ను సంప్ర‌దించాల‌ని మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి సూచించారు.

గత రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాదు నగరం అతలాకుతలమైంది. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై మ్యాన్ హోల్స్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎం కేసీఆర్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటానని, పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని పేర్కొన్నారు.

జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సహాయపడాలని, నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.