టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పరిశీలనకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు

dhulipalla-narendra

అమరావతి : టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉదయం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పరిశీలనకు వెళుతున్న ధూళిపాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా.. టిడిపి కార్యకర్తలు పోలీసుల వాహనాలకు అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలందరినీ పక్కకు తప్పించిన పోలీసులు.. ధూళిపాళ్లతో పాటు మరికొందరు కార్యకర్తలను అరెస్టు చేసి పొన్నూరు స్టేషన్ కు తరలించారు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు విషయం తెలిసి పొన్నూరు స్టేషన్ కు టిడిపి శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. నరేంద్ర అరెస్టు అక్రమమంటూ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. అంతకుముందు పొన్నూరు మండలం చింతలపూడిలో టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి ధూళిపాళ్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేసిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులు శిక్షణ పొందినా ఈ ప్రభుత్వం కళ్లుండి కూడా చూడలేకపోతోందని మండిపడ్డారు. అధికారులపై మంత్రులు ఒత్తిడి తెచ్చి చంద్రబాబును కేసులో ఇరికించారని, లోకేశ్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు.