స‌ర్పంచ్‌ల‌కు కూడా రాజ్యాంగం హ‌క్కులిచ్చింది : చంద్ర‌బాబు

స‌ర్పంచ్‌ల‌కు టీడీపీ అవ‌గాహ‌న స‌ద‌స్సు

అమరావతి: రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను పోరాడి సాధించుకోవాల‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏపీలోని గ్రామ స‌ర్పంచ్‌ల‌కు పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి విడుద‌ల‌వుతున్న న‌రేగా నిధుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు పంచాయ‌తీల‌కు ఇవ్వ‌కుండా ఇత‌ర‌త్రా ప‌నుల‌కు మ‌ళ్లిస్తోంద‌ని, దీనిపై స‌ర్పంచ్‌లు క‌లిసిక‌ట్టుగా పోరాటం సాగించి హ‌క్కుల‌ను సాధించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. టీడీపీ ఆధ్వ‌ర్యంలో గురువారం నాడు కొన్ని జిల్లాల స‌ర్పంచ్‌ల‌కు అవ‌గాహ‌న స‌దస్సు నిర్వ‌హించారు.

ఈ సద‌స్సుకు హాజ‌రైన చంద్ర‌బాబు నిధుల‌ను రాబ‌ట్టుకోవాల్సిన అంశాల‌పై స‌ర్పంచ్‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తే.. రాష్ట్రాలు ఊరుకుంటాయా? అని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు.. గ్రామ పంచాయ‌తీల‌కు ఇచ్చిన నిధుల‌ను రాష్ట్రాలు ప‌క్క‌దారి ప‌ట్టిస్తే స‌ర్పంచ్‌లు పోరాడాల్సిందేన‌ని తెలిపారు. నా ప్ర‌భుత్వం నా ఇష్టం అన్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమర్శించిన చంద్ర‌బాబు.. నా పంచాయ‌తీ నా ఇష్టం అన్న రీతిన స‌ర్పంచ్‌లు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాటం సాగించాల్సిందేన‌ని సూచించారు. సీఎంగా జ‌గ‌న్‌కు రాజ్యాంగం ఎలాంటి హ‌క్కులిచ్చిందో.. అలాగే స‌ర్పంచ్‌ల‌కు కూడా రాజ్యాంగ్ హ‌క్కులిచ్చింద‌ని, వాటిని పోరాడి సాధించుకోవాల్సిన అవ‌స‌రాన్ని స‌ర్పంచ్‌లు గుర్తించాల‌ని చంద్ర‌బాబు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/