టిఆర్ఎస్ పార్టీ ఫై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపణలు చేసారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకం గానే తనను పక్కన పెడుతున్నారని విమర్శలు చేసారు. తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కంటే నేనే సీనియర్ ని అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశంలో ఓడిపోయి టీఆర్ఎ స్ పార్టీ లో చేరి మళ్లీ గెలవలేని, దమ్ములేని తుమ్మల నాగేశ్వరరావు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించకపోతే తప్పనిసరిగా పార్టీ మారతానని తెలిపారు.

ఇక రెండు నెలల క్రితం వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కుటుంబంలో విషాదం నింపింది. సారపాకలోని స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె అయిన మహాలక్ష్మి ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ఇక వెంకటేశ్వర్లు రాజకీయం విషయానికి వస్తే… తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండొవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాటి వెంకటేశ్వర్లు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.