ప్రస్తుత రాజకీయాలకు పవన్ కల్యాణే కరెక్ట్ – చిరంజీవి

,

ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పవన్ కల్యాణే కరెక్ట్ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి (వైఎన్‌) కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాలేజీ పూర్వ విద్యార్థి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కాలేజీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తనకు నటనపై ఇష్టం ఉండేదని, ఒక నాటకం వేస్తే ఉత్తమ నటుడిగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. తర్వాత అమ్మాయిలు తనను చూస్తుంటే పెద్ద హీరోలా ఫీలయ్యేవాణ్ణి అని నవ్వుతూ చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి సినిమా రంగంలో నటుడిగా రాణించాలనే బలమైన నమ్మకానికి పునాది పడింది వైఎన్‌ కాలేజీలోనే అని తెలిపారు. అలాగే రాజకీయాల ఫై స్పందించారు.

‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. సెన్సిటివ్‌గా ఉంటే ఎదగలేం. రాజకీయాల్లో మాటలు అనాలి.. అనిపించుకోవాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. అప్పుడే రాణించే అవకాశం ఉంటుంది. ఇదంతా నాకు అవసరమా’ అని అనుకున్నారని చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ తగినవాడని, మాటలు అంటాడు.. అనిపించుకుంటాడని చెప్పారు. ‘ఆయనకు మీరందరూ ఉన్నారు.. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడ’ని ఆశాభావం వ్యక్తం చేశారు.