టాటా సన్స్‌ చేతికే ఎయిర్‌ ఇండియా

న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా సన్స్‌ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్‌ జెట్‌తో పాటు ఎయిర్‌ ఇండియా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌కే మొగ్గు చూపింది. ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్‌ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే అధికారికంగా ప్రకటించారు. ఒకప్పుడు టాటాలే స్థాపించిన ఎయిరిండియా, అర్ధశతాబ్దం తర్వాత మళ్లీ సొంతగూటికి చేరినట్టయింది. టాటా సన్స్ తన బిడ్డింగ్ ద్వారా ఎయిరిండియాను మాత్రమే కాకుండా, ఈ సంస్థకు చెందిన తక్కువ ధరల విభాగం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ను కూడా దక్కించుకుంది. అంతేకాదు, ఎయిరిండియా ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ 50 శాతం వాటాదారుగా అవతరించింది.

కాగా, ఎయిరిండియా 2007 నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/