సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై కామెంట్స్

భద్రాచలం పర్యటన లో సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కామెంట్స్ ఫై ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా..తాజాగా గవర్నర్ తమిళిసై స్పందించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) అనే కొత్త పద్ధతి వచ్చిందని , క్లౌడ్ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని అన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలేనని తెలిపారు. కాకపోతే ఎప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలు వచ్చాయి అని అన్నారు. ఇక క్లౌడ్ బరస్ట్ పై అంతర్జాతీయ కుట్ర సమాచారం ఉంటే ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఏ దేశాలు, ఏ సంస్థలు కుట్రలు చేశాయో సీఎం కేసీఆర్ తెలిపితే విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక గవర్నర్ తమిళిసై ప్రస్తుతం గోదావరి వరదకు ముంపుకు గురైన యానంలో పర్యటిస్తున్నారు. బాధితుల నుండి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.