టిఆర్ఎస్ కు భారీ షాక్ ..కాంగ్రెస్ లో చేరిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నేతలు , మాజీ ఎమ్మెల్యే లు , ఎంపీలు వరుస పెట్టి బిజెపి , కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కారు దిగి కమలం , చేతి కిందకు వెళ్లగా..తాజాగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి.. 2014లో వోడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. గత రెండు దఫాలుగా హుస్నాబాద్ లో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఒడితల సతీష్ కుమార్ గెలుస్తూ వస్తున్నారు. అయితే అధికార పార్టీలో టికెట్ రాదనుకున్నారో లేక అక్కడ గుర్తింపు లేదని భావించారో తెలియదు కానీ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ ని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ , బిజెపి పార్టీలు పలు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చేర్చుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఎవరు వస్తామన్న వద్దనకుండా ఆహ్వానం పలుకుతున్నారు. కాంగ్రెస్ చేరికల కమిటీ కన్వీనర్గా సీనియర్ నేత జానారెడ్డి ఉండగా.. బిజెపి చేరికల కమిటీ బాధ్యతలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బిజెపిలో భారీగా చేరికలు జరగగా.. ఇటీవల కాంగ్రెస్ లోకి చేరేందుకు ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.