వరదసాయంపై కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు

telangana not get a single rupee under ndrf grant since 2018

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రం తీరు ఫై నిప్పులు చెరిగారు. 2018 నుంచి రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోడీజీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, కో ఆపరేటివ్ ఫెడరలిజం..? అంటే అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

2020లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలకు.. ప్రస్తుతం వచ్చిన గోదావరి వరదలకు పరిహారం చెల్లించరా..? ఎందుకు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటే ఇదేనా..? సహకార సమాఖ్య వ్యవస్థకు అర్థం ఇదేనా..? అని ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు.

2018-2022 మధ్య వివిధ రాష్ట్రాలకు ఎన్డీఆర్‌ఎఫ్ కింద కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను మంత్రి కేటీఆర్ బయటపెట్టారు. మహారాష్ట్రకు రూ.8754.5 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.4538 కోట్లు, కర్ణాటకకు రూ.6480.69 కోట్ల మేర నిధులు కేటాయించిందని తెలంగాణకు మాత్రం గుండు సున్నా చూపిందని కేటీఆర్ ఆరోపించారు. 2018-19 నుంచి 2022-23 వరకు (జూలై 7 నాటికి) ఎన్డీఆర్ఎఫ్ కింద రాష్ట్రాల వారీగా అందజేసిన నిధుల వివరాలతో కూడిన పట్టికను సైతం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.