ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడి భవంతిలో తాలిబన్ల ప్రవేశం

విలాసవంతమైన భవనంలో సేదదీరిన తాలిబన్లు

కాబుల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కు చెందిన విలాసవంతమైన భవనం ఇప్పుడు తాలిబన్ల పరమైంది. ఇటీవల రాజధాని కాబూల్ ను ఆక్రమించిన తాలిబన్లు, తాజాగా దోస్తుమ్ కు చెందిన లగ్జరీ విల్లాను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో సుందరమైన ఆ భవనంలో తాలిబన్లు ప్రవేశించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆ భవనంలోని అందమైన ఉద్యానవనంలోనూ, భవంతి లోపలి సోఫాల్లోనూ తాలిబన్ ఫైటర్లు సేదదీరుతూ కనిపించారు.

విస్మయం కలిగించే అంశాలు ఏమిటంటే… ఆ విల్లాలో ఉన్న కొన్ని అంశాలు సాధారణ ఆఫ్ఘన్ పౌరులకు ఏమాత్రం తెలియదు. భారీ గ్లాస్ షాండ్లియర్లు, మెత్తని సోఫాలు, ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్, టర్కోయిస్ టైల్స్, సౌనా టబ్, టర్కిష్ స్టీమ్ బాత్, అత్యంత అధునాతన జిమ్, ఆక్వేరియంలు అందులో ఉన్నాయి. ఇలాంటివాటిని ఆఫ్ఘన్ పౌరుల్లో చాలామంది ఇప్పటివరకు చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు.

దీనిపై తాలిబన్ కమాండర్ ఖారీ సలాహుద్దీన్ అయోబీ మాట్లాడుతూ.. ఇస్లామ్ ఎప్పుడూ ఇలాంటి విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకోదని, విలాసవంతమైన జీవితం స్వర్గంలోనే లభిస్తుందన్నది తమ విశ్వాసం అని స్పష్టం చేశారు. అది మరణానంతర జీవితం అని పేర్కొన్నారు.

కాగా, తాలిబన్లు స్వాధీనం చేసుకున్న భవనం యజమాని రషీద్ దోస్తుమ్ సామాన్యుడు కాదు. ఆఫ్ఘన్ కు గతంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన యుద్ధ ప్రభువుగా పేరుగడించారు. మోసకారి రాజకీయాలకు పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. 67 ఏళ్ల దోస్తుమ్ ఉజ్బెకిస్థాన్ పరారైనట్టు భావిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/