37.97 శాతానికి చేరుకున్న పాకిస్థాన్ ద్రవ్యోల్బణం

నెల రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక నిల్వలు

pakistan-inflation-rockets-to-record-nearly-38-percent

ఇస్లామాబాద్‌ః ఆర్థిక పతనం అంచుకుని చేరుకుని నానా కష్టాలు పడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ద్రవ్యోల్బణం రాకెట్‌లో దూసుకెళ్తోంది. మే నెలలో వార్షిక ద్రవ్యోల్బణం ఏకంగా 37.97 శాతానికి ఎగబాకినట్టు అధికారిక డేటా వెల్లడించింది. నిల్వ ఆహారాలు, రవాణా ధరలు మే 2022 కంటే 50 శాతానికి పైగా పెరిగాయి. గత 12 నెలల్లో సగటు ద్రవ్యోల్బణం 29.16గా ఉన్నట్టు పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం పేదలు, మధ్యతరగతి కుటుంబాలపై దారుణ ప్రభావం చూపిస్తోందని, వారి ఆదాయం ఆవిరైపోతోందని కరాచీ ఫైనాన్షియర్ మొహమ్మద్ సోహైల్ తెలిపారు. పాకిస్థాన్‌లో ఏళ్ల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం ఆ దేశాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్లింది. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దీనికి మరింత ఆజ్యం పోసింది.

ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను గత నెలలో అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర హింసకు దారితీసింది. కొన్ని రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్‌ను బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో ఒప్పందం చేసుకున్న 6.5 బిలియన్ డాలర్ల రుణం నెలల తరబడి నిలిచిపోయింది.

మరోవైపు, పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు 4.2 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఈ సొమ్ము నెల రోజుల దిగుమతులకు కూడా సరిపోదు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం తెలియక పాక్ ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చే వారం వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో జూన్ 30తో ముగిసే ఏడాదికి ఇప్పటికే దాని వృద్ధి అంచనాను ఐదు శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించింది.