యూఎన్‌కు కొత్త ప్ర‌తినిధిని నియ‌మించిన తాలిబ‌న్లు

న్యూయార్క్‌: ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశాలు న్యూయార్క్‌లో ప్రారంభం అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మావేశాల్లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించిన తాలిబ‌న్లు కూడా త‌మ ప్ర‌తినిధిని పంప‌నున్నారు. యూఎన్ ప్ర‌తినిధిగా సుహేల్ షాహీన్‌ను నియ‌మించిన‌ట్లు ఆఫ్ఘ‌నిస్తాన్ వెల్ల‌డించింది. ఈ మేరకు యూఎన్‌కు లేఖ కూడా రాసింది. తాలిబ‌న్ల విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి.. యూఎన్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్‌కు లేఖ రాశారు. గ‌తంలో ఉన్న ఇసాక్‌జాయి బ‌దులుగా ఆయ‌న స్థానంలో షాహీన్ ప్ర‌తినిధి అయిన‌ట్లు యూఎన్‌కు రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.

అయితే కొత్త ప్ర‌తినిధికి యూఎన్‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలంటే, ముందుగా 9 దేశాల క‌మిటీ ఆమోదం ద‌క్కాల్సి ఉంటుంది. అమెరికా, చైనా, ర‌ష్యా దేశాలు ఆ క‌మిటీలో ఉన్నాయి. అయితే ఆ దేశాలు సోమ‌వారంలోగా భేటీ అయ్యే అవ‌కాశాలు లేవు. దీంతో కొత్త ప్ర‌తినిధి షాహీన్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితిలో ప్ర‌సంగించే అవ‌కాశం ద‌క్క‌ద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. అయితే క‌మిటీ తన నిర్ణ‌యాన్ని చెప్పేవ‌ర‌కు ఇసాక్‌జాయియే ఆ సీటులో ఉంటార‌ని యూఎన్ చెప్పింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/