టీ 20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్

t20 world cup final england won

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఫై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. హోరా హోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి రెండో సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బ‌ట్ల‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 137 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ రిజ్వాన్ 15 ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. కెప్టెన్ బాబ‌ర్ ఆజం (32 ప‌రుగులు), మిడిల్ ఆర్డ‌ర్ బ్యాటర్ షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో, 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి పాకిస్థాన్ 137 ప‌రుగులు చేసింది.

138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద అలెక్స్ హేల్స్ షాహీన్ అఫ్రిదీకి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సాల్ట్ 10 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే కెప్టెన్ బట్లర్ కూడా ఔటయ్యాడు. 17 బంతుల్లోనే 26 పరుగులు చేసి మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన బట్లర్ను రవూఫ్ బుట్టలో వేసుకోవడంతో..ఇంగ్లాండ్ 45 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టును బెన్ స్టోక్స్ ఆదుకున్నాడు. హార్రీ బ్రూక్తో విలువైన పాట్నర్ షిప్ను నమోదు చేశాడు. అయితే బ్రూక్ను షాదాబ్ ఖాన్ ఔట్ చేయడంతో పాక్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఈ ఆనందాన్ని స్టోక్స్ ఎంతో సేపు ఉంచలేదు. మొయిన్ ఆలీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో మొయిన్ అలీ ఔటైనా….స్టోక్స్ ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు.

ఇక టీ20 వరల్డ్‌ కప్‌ అందుకున్న ఇంగ్లండ్‌కు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ రూ. 6.5 కోట్లు అందుకోనుంది.