ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన దుండగులు

గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు కట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహంపై దుండగుల దుశ్చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. మహనీయులను గౌరవించుకునే మంచి సంస్కృతికి వైస్సార్సీపీ మొదటి నుంచి దూరంగానే ఉంటోందని విమర్శించారు. సంస్థలకు ఉన్న నాయకుల పేర్ల మార్పు, విగ్రహాల తొలగింపు వంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతుండడంతో, ఆ పార్టీ క్యాడర్ కూడా అదే దారిలో వెళుతోందని వివరించారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సైతం ఈ ఘటన ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన నీచులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ కు ఎన్నో అవమానాలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీనాత వల్లే ఎన్టీఆర్ కు తరచూ అవమానం జరుగుతోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

“ఎన్టీఆర్ విగ్రహాలకు గతంలో వైసీపీ నేతలు నిప్పుపెట్టడంతో పాటు పట్టపగలే దాడి చేశారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఆనాడే కఠినంగా శిక్షించి ఉంటే నేడు ఈ అవమానం జరిగేది కాదు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి పెద్ద అవమానమే చేస్తే… దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే మా స్పందన మరోలా ఉంటుంది. ప్రభుత్వానికి ఎన్టీఆర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి” అంటూ అచ్చెన్న ఘాటుగా స్పందించారు.