ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మరో యుద్దానికి శ్రీకారం చుట్టబోతుంది

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మరో యుద్దానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈరోజు గాంధీ జయంతి సందర్భాంగా ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో పోరాటానికి సిద్దమవుతుంది.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ దిల్‌ సుఖ్‌ నగర్‌ లోని రాజీవ్‌ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ పేరుతో డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించాలని, రూ. 4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి, జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాండ్స్ తో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అలాగే పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తారు. వీటికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్‌ 9న పరేడ్‌గ్రౌండ్‌లో ముగింపు కార్యక్రమాన్ని లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు.