క్లీన్ ఏపీ కోసం ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

క్లీన్‌ ఏపీ కోసం చెత్త సేకరించే 4 వేల 97 వాహనాలని ప్రారంభించి.. 13 జిల్లాల‌ కార్మికులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి. పట్టణాలలో 3 వేల 97 హైడ్రాలిక్‌ గార్బేజ్ ఆటోలు, 1771 ఇ-ఆటోలని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకుపైగా పంచాయతీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ప్రవేశపెడుతోంది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి మూడు డస్ట్‌ బిన్లు కూడా ఇవ్వనుంది. 123 కార్పొరేషన్ లు, మున్సిపాల్టీలోని 40 లక్షల నివాసాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్ లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు రూ. 100 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. అంతేగాకుండా..జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 1500 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్లు కేటాయించారు.

రాష్ట్రంలోని 65 నాన్‌ అమృత్‌ సిటీలలో సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు చేయనున్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బంది నియమించి…జీత భత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు.