ఈరోజు నుండి తెలంగాణ లో కాంగ్రెస్ బస్సు యాత్ర..

నవంబర్ 30 న తెలంగాణ లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీ లు ఎన్నికల ప్రచారం లో బిజీ గా మారాయి. తమ మేనిఫెస్టో లతో ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇక తెలంగాణ లో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు నుండి బస్సు యాత్ర మొదలుపెట్టబోతుంది. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ బస్ యాత్ర సాగనుంది. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం వద్ద తన సోదరి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఈ బస్సు యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించనున్నారు.

బుధవారం సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల బ్రోచర్‌ను రామప్ప దేవాలయంలో శివలింగం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అక్కడి నుంచి వెంకటాపూర్‌ మండలంలోని రామాంజపురం నిర్వహించే ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించి దాదాపు 25 కిలోమీటర్ల మేర యాత్రలో ఇద్దరూ పాల్గొంటారు. రాత్రి భూపాలపల్లిలోని కేటీపీపీలో బస చేస్తారు. తిరిగి మరుసటి రోజు 19న ఉదయం 7 గంటలకు భూపాలపల్లిలోని 5 ఇన్‌క్లైన్‌ కమాన్‌ నుంచి 3 వేల బైకులతో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్‌గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు.

అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం బయల్దేరుతుంది. మొదటి రోజు ములుగు జిల్లాలో, రెండో రోజు భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో, నాలుగో రోజు నిజామాబాద్‌ జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటన కొనసాగనుంది.