ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జానారెడ్డి కీలక వ్యాఖ్యలు

నవంబర్ 30 న తెలంగాణ లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీ లు ఎన్నికల ప్రచారం లో బిజీ గా మారాయి. తమ మేనిఫెస్టో లతో ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇక తెలంగాణ లో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పలు పార్టీల నుండి నేతలు చేరుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనేది ఎవరు..ఇంకా తేలకముందే పార్టీలోని సీనియర్స్ మాత్రం మేమంటే మీము అంటూ ఎవరికీ వారు చెప్పుకుంటూ వస్తున్నారు.

తాజాగా సీనియర్ నేత జానారెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో మంగళవారం నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, తన కుమారుడు జయవీర్‌రెడ్డితో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సీఎం కావాలన్న తన అభిలాషను మరోసారి బయటపెట్టారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జానారెడ్డి సీఎం రేసులో ఉంటారా అని ప్రశ్నించగా.. ‘పదవుల రేసులో నేనెప్పుడూ లేను. పదవులే రేసులో ఉండి నన్ను అందుకుంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల హృదయాల్లో నేను సీఎం కావాలని ఉంది. సీఎం పదవి హఠాత్తుగా రావొచ్చేమో. ఒకవేళ ఏవైనా పదవులు వస్తే నేను కాదనను. నాకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. 21 ఏండ్లకే రాజకీయాల్లోకి వచ్చిన, 36 ఏండ్లకే మంత్రినయ్యా, ఏ సీఎం చేయనన్ని శాఖలకు మంత్రిగా చేసినా’ అని చెప్పారు.

ఎమ్మెల్యేగా పోటీలో లేని మీరు సీఎం ఎలా అవుతారని ప్రశ్నించగా.. ‘ఆర్నెళ్ల సమయం ఉంటుంది. ఆ లోపు నా కొడుకు రాజీనామా చేస్తడు. నేను పోటీ చేసి ఎమ్మెల్యే అవుతా’ నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా లేకున్నా పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా అని ప్రశ్నించారు. సీఎం అనే ప్రజల చివరి కోరిక కూడా నాకు కూడా తెల్వకుండానే తీరవచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు. దాంతో జానారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.