ఆర్టికల్ 370 రద్దుపై పిటిషన్లు.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు రోజువారీ విచారణ

Supreme court
Supreme court

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఆగస్టు రెండు నుంచి సోమవారం, శుక్రవారం మినహా మిగిలిన పని దినాల్లో వీటిపై విచారణ జరుగుతుందని తెలిపింది. ఈ అధికరణ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌ను, మాజీ విద్యార్థి నేత షెహలా రషీద్‌ను అనుమతించింది.

కేంద్ర ప్రభుత్వం సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో, అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ-కశ్మీరులో పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని తెలిపింది. మూడు దశాబ్దాల సంక్షోభం తర్వాత మునుపెన్నడూ లేని అభివృద్ధి, ప్రగతి, భద్రత, స్థిరత్వం రావడానికి ఈ చర్య దోహదపడిందని తెలిపింది. మూడేళ్ల నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఎటువంటి సమ్మెలు, ఆందోళనలు జరగడం లేదని వివరించింది. అయితే రాజ్యాంగపరమైన అంశాల గురించి వాదించేటపుడు ఈ అఫిడవిట్‌పై ఆధారపడబోమని కేంద్రం తరపు వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పారు. దీనిని ధర్మాసనం నమోదు చేసింది.

కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న అధికరణ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరుపుతుంది.