సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court refuses urgent hearing of Kejriwal

న్యూఢిల్లీః ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తోసిపుచ్చింది. కాగా, లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. అయితే గడువు ముగిసిన వెంటనే జూన్ 2న లొంగిపోవాలని బెయిల్ ఇచ్చే సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య కారణాలను పేర్కొంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వెంటనే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున దరఖాస్తు చేసుకున్నారు. అయితే బుధవారం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న రిజిస్ట్రార్‌ దరఖాస్తును సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆయన దరఖాస్తు తిరస్కరించబడింది.