ప్లీనరీ వేదికగా ప్రకటన : వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైస్.విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ వేదికగా ఆమె ప్రకటించారు. ఇడుపులపాయలో వైస్సార్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జగన్, విజయమ్మలు ప్లీనరీ వేదికవద్దకు వచ్చారు. జగన్‌ మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించి, ప్రారంభోపన్యాసం చేసారు. 2009 సెప్టెంబర్‌ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక​ రూపం దాల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని జగన్‌ చెప్పుకొచ్చారు. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు’’ అని జగన్ తెలిపారు.

అనంతరం విజయమ్మ మాట్లాడుతూ..వైఎస్సార్‌ అందరివాడని.. కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని విజయమ్మ అన్నారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని ఈ సందర్బంగా విజయమ్మ చెప్పుకొచ్చారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని , అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదన్నారు. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్‌ విజయమ్మ చెప్పుకొచ్చారు.

జగన్‌ మాస్‌ లీడర్‌. యువతకు రోల్‌ మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్‌ చూసుకుంటారని విజయమ్మ అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని, జగన్‌ చెప్పినవే కాకుండా చెప్పనవీ కూడా చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేశాం కాబట్టే ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రూ.1.60 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని విజయమ్మ చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల YSRTP పార్టీ ఏర్పాటు చేసి ఒంటరి పోరాటం చేస్తుందని… నేను అండగా ఉండాలన్నారు. తండ్రి ఆశయాలు కోసం షర్మిల ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో షర్మిల గడ్డి ప్రయత్నం చేస్తుందని విజయమ్మ వివరించారు. జగన్ కోసం వైయస్ షర్మిల… పాదయాత్ర చేసిందని… కానీ కొంతమంది తమ కుటుంబం పై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తన బిడ్డ షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేస్తుందని , నా బిడ్డకు నా అండ ఉండాలని..అందుకే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ తెలిపింది. షర్మిలకు అండగా ఉండేదుకే రాజీనామా చేస్తున్న తప్ప మరోటి లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు వస్తాయని వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు.