స్వర్ణగిరి – శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము

శ్రీమతే రామానుజాయ నమః

Swarnagiri – Sri Venkateswara Swamy Temple

స్వర్ణగిరి – శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము, యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రిభువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారము గా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నది.


ఈ దివా స్వర్ణగిరి – యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. ఈ క్షేత్రమ్ తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం గా చెప్పుకోవచ్చు.
పల్లవ, చోళ , చాళుక్య హొయసల, విజయ నగర , నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేసారు. అంతే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు. శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి గతం లో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య, 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము.
దేవాలయం మొత్తం 22 ఎకరాల విస్థీర్ణం లో నిర్మాణం జరిగింది.

ఇందులోస్వాగత తోరణం : స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారం గా స్వాగత తోరణం నిర్మాణము కావించబడినది. విజయ నగర , నాయక శిల్ప శైలి లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంఖు, చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించ బడినది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి “రామానుజ మార్గం” అని పేరు. ఆ మార్గం లో ముందుకు సాగితే మనకు “బ్రహ్మ రథం” కనిపిస్తుంది.

బ్రహ్మ రథం : విశిష్ఠమైన స్వాగతాన్ని వర్ణిచేటప్పుడు “ బ్రహ్మరథం” పట్టారు అని అంటారు. స్వర్ణ గిరీశుని దర్శించడానికై వచ్చే భక్తులకు స్వాగతం పలికుతున్నట్లు గా ఇక్కడ “బ్రహ్మ రథం” ఉంది. ప్రాచీన రథనిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలా మాయం గా నిర్మితమైనది.

అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి.

శ్రీవారి పాదాలు:
తిరుమల మొదటి మెట్టు అలిరిపి లో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారిగురువుగారైన శ్రీ తిరుమల నంబి గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయం గా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము. ఆ విశేషసందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్టించుకున్నాము. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్త ముద్రతో శ్రీవారి క్షేత్రం లోనికి పవిత్రమైన భక్తీ భావం తో ప్రవేశించమని సూచిస్తూఉన్నారు.

ఆ పక్కనే రోడ్డుమార్గం వద్ద శ్రీ రామానుజాచార్యస్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్టితమై ఉంటుంది. ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అనిపేరు.

ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి. వాటిపైనా బ్రహ్మ , శివుడు సతీ సమేతం గా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఆముందు మనకుబ్మట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అనిపేరు. శ్రీవారి భక్తులు, శ్రీహరి దాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గం లో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి.

మానేపల్లి విజయ స్తంభము:

స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. ఈ ఆధునిక కాలం లో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది…!? ఈ ఆలయ నిర్మాణం ద్వార శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించియావన్మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి “ మానేపల్లి విజయ స్తంభము” అనే నామకరణంతో ఈ విజయ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. లత అలంకార పూర్ణమయిన ఈ స్తంభ పీఠం మంగళ ప్రదమైన గజరాజములు, సింహాలు, వృషభము లతోపాటుగా, శ్రీవారు, శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్పీకరించ బడ్డాయి.

అక్కడినుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైనా ప్రాకారము దానికి నాల్గువైపులా నాలుగు రాజ గోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. గో అంటే రక్షించునది అని పేరు. పురమును రక్షించునది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురము ను రక్షించునది కనుక గోపురము అనిపేరు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అని అర్థం. సకల వేద స్వరూపము, దేవతానిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్య వలెను. పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజ గోపురాలను మన చూడవచ్చు. శ్రీ శైలం లో శివాజీ గోపురం, శ్రీ కృష్ణ దేవరాయ గోపురం, మొదలైనవి. ఇవన్ని ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికితెచ్చుకునేలా ఏర్పడ్డాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు నాలిగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని, ఆ కనిపించే భువనగిరి కోటనుండి ఈ తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించిన కల్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేసారు.

భువనగిరి – చారిత్రక ప్రశస్తి :

తెలంగాణా రాష్ట్రంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత గలిగిన గిరిదుర్గం. తెలంగాణా పౌరుషానికి, ప్రతాపానికీ ప్రతీక. కల్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీశ 1041 – 1068 వరకు “ త్రైలోక్య మల్ల” అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత “భువనైక మల్ల” అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు 1068 – 76 వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకము గా పాలించాడు. ఆ తర్వాత “ త్రిభువన మల్ల” బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర “త్రిభువనగిరి” అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అందలి కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు. ఆ త్రిభువన గిరి కాలక్రమం లో భువనగిరి గాను, భోన్ గిరి గానూ స్థిరపడిపోయింది.

కల్యాణి చాళుక్యుల తర్వాత ఈ ఈ భువనగిరి కోట, కాకతీయులు, ముసునూరి వంశీకులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, అజం షాహీల పాలనలను చవిచూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ప్రత్యేక రాష్ట్రం గా తెలంగాణా ఏర్పడిన తర్వాత చరిత్ర- సంస్కృతికి ప్రతీకగా వెలుగుతుందీ భువనగిరి.

భువనగిరి సుందరతర ప్రాకృతిక అంద చందాల నడుమ బహు సుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస. దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది.

ఆకాశ హర్మ్యాలు గా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజ గోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణా గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి.

అందుకే ఈ గోపురాలు “భువనైక మల్ల”, “ త్రైలోక్య మల్ల” , “ త్రిభువన మల్ల”, “ రాయగజకేసరి “ అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి.

ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి – “త్రైలోక్య మల్ల రాజ గోపురము”

దక్షిణ రాజగోపురానికి – “త్రిభువన మల్ల రాజ గోపురము”

పశ్చిమ రాజగోపురానికి – “భువనైక మల్ల రాజ గోపురము”

ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో – “రాయ గజకేసరి రాజ గోపురము”
అనే నామకరణం జరిగింది.

ఇది ఆయా చక్రవర్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణా చరిత్ర లో సమున్నత స్థానం కలిగిన ఆ ఆమహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్ తరాల వారికి కలుగుతుంది.

తూర్పువైపున ఉన్న ఈ ప్రధాన రాజ గోపురం ను దర్శించండి. సకల దేవతలకు నెలవైనట్లు గా అనేక దేవతల విగ్రహాలతో అలరారుతున్నది ఏగోపురం. క్షీరసాగర మథనం, శ్రీనివాస కళ్యాణము, శ్రీ రంగనాథుని విగ్రహాలతో, 75 అడుగుల ఎత్తులో 5 అంతస్తులుగా, రెండు స్థంభాలతోని గోపురమండపముతో, చోళ, మధుర నాయకుల శిల్పకళా రీతులతో నిర్మితమైన ఈ “ భువనైక మల్ల గోపురాన్ని” దర్శిస్తూ ముందుకు సాగుదాం.

ధ్వజ స్తంభం – బలిపీఠం:

ఆ ముందుకు వెళ్ళగానే 61 అడుగుల ఎత్తైన ధ్వజ స్తంభం , బలిపీఠం కనిపిస్తాయి. విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగుర వేస్తారు.

ఆ ముందుకు చూస్తే శ్రీ గరుడాల్వార్ ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది. అందులో నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ గరుడాల్వార్ కొలువై ఉంటారు.

మదన గోపాల కృష్ణ స్వామి సన్నిధి:

10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదనగోపాల కృష్ణ స్వామి ఎక్కడ కొలువుదీరబోతున్నాడు. బహుశా ఇలాంటి కృష్ణ ఆలయము ఇంకెక్కడా లేదు. చరిత్రలో ఇదే మొదటిది.

శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి: శ్రీ హరి అంతరంగ అలార్మెల్ మంగ తాయార్, శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి. జగన్మాత ను దర్శించుకుని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువపులా గంభీరమయిన జయ విజయ ద్వారపాలకులు తమ సూచీహస్తాలతో , “కామ క్రోధ. మద మత్సర్యాలన్నింటినీ ఇక్కడే వదలివేసి కేవలం భక్తి భావన , దాస భావన లతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు” అని హెచ్చరిస్తూ ఉంటారు.

ఆ ద్వార పాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాళం లోనికి చేరుతాము. అది భగంతునికి ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరము ఆని పేరు. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. భగవంతుణ్ణి పూజించేవాల్లని భక్తులను, ఎలాంటి కోరికల కైనా కేవలం విష్ణు దేవున్నే ఆరాధించే వారిని వైష్ణవులను, కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరుని వారిని వైష్ణవులనీ, వేరే ఏమీ వద్దు నీవే కావాలి, నీతోనే ఉండిపోవాలి అని మనసావ వాచా కర్మణా ప్రవర్తించే వారిని ప్రపన్నులనీ, ఆ ప్రపన్నులలో మరో మెట్టు ఎక్కువ భావనతో ఉండేవారిని ఏకాంతులనీ, పరమేకాంతుల నీ పిలుస్తారు. అలాంటి ఏకాంతులు భగవంతుని సేవించుకునే ప్రదేశము కనుజ దీనికి ఏకాంత మందిరము అని నామకరణం చేసారు.

అదిగో శ్రీవారి సన్నిధి.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమద్యంతా రహితుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి. సుమారి 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో, వరద కటి హస్తాలతో చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిక్ దివ్య రూపాన్ని దర్శిద్దాము. ఈ రూపము వేదాంత వేత్తల్లెల్ల వెదికేటి రూపము, ఆదిఅంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించమే మహద్భాగ్యము కదా…! ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయఎం గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకి “కులశేఖర ప్పడి” అని పిలుస్తారు. అదే విధం గా శ్రీ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మీ పుణ్య దంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారినీ ఆచార్యుల ద్వారా ఆహానించుకున్నారు కావున ఆ గర్భాలయ గడపకి “విజయరామ ప్పడి” అని నామకరణం గావించబడినది.

అక్కడ నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ ఆండాళ్ – గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. శ్రీ గోదా అమ్మవారిని దర్శించి ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురువైన భగవద్రామానుజాచార్య సన్నిధి దర్శించకుందాము. ఆ సన్నిధిలో శ్రీ నమ్మల్వార్, శ్రీ మనవాళమహాముని పన్నిద్దరు ఆళ్వార్లు కొలువుదీరి ఉంటారు.

ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక “ మురళీ గోపాల మండపం” అనే మహా మండపం ఉంటుంది. ఈ మండపంలో విజయ నగర శైలిలో 22 స్తంభాలతో కూడిన ఈ మహా మండపం చూపరులను నిశ్చేష్టులను చేస్తుంది. చుట్టూ అనివెట్టి స్తంభాలు, మధ్యలో విష్ణు కాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రక్రాంతా లనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు. ఆ మధ్యలో పైకిచూస్తే వేసర శైలి లోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలు గా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఆ మధ్యలో సూర్య రశ్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటుచెయ్యబడ్డాయి. మండపం పైన అయంత నైపుణ్యముగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ ను చూడవచ్చు.

ఆ మండపానికి ఇరువైపులా సోపానాలు, ఆ సోపానాలకు ఇరువైపులా యష్ఠిదండాలు అనే ఏనుగుప్రతిమలను చూడవచ్చు. చోళ రాజులు నిర్మించిన అనేక దేవాలయాలలో “దారాసురం” అనే చోటా ఎలాంటి అద్భుత్గమైన ఆకృతిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ్ ఏర్పాటుచేసారు.

అక్కడినుండి ప్రదక్షణగా వస్తే, ఆగ్నేయ భాగం లో శ్రీ వారి వంటశాల ఆ వంట శాలను పర్యవేక్షించేందుకై శ్రీ వకుల మాతా సన్నిధి కొలువై ఉంటుంది. అందులోనర్ శ్రీవారి వాహనాలు ఉంటాయి. శ్రీ వారి వైభవాన్ని స్మరింపచేసే ఆ మండపానికి “వైభవ మండపం” అనిపేరు.

ఆ ముందుకెళితే శ్రీవారి తులాభారము, శ్రీవారి అనుగ్రహం వంశ వంశాల పర్యంతము , చిరకాలము ఉండాలనే వేద ఆశీర్వచనమ్ అనుగ్రహించే మడపం ఉంటుంది. దీనికి వంశీ కృష్ణ మండపం అనిపేరు.

అక్కడనుండి శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగం లో రెండు వరద హస్తాలతో, అఖండ ఐశ్వర్య ప్రదాయని “శ్రీ స్వర్ణ లక్ష్మి తాయారు” బంగారు కాంతులతో కొలువై ఉంటారు.

ఆముందుకు వెళితే వాయువ్య భాగములోనీ మండపములో “దర్పణ సుందరం” అనే అద్దాల మహల్ ఉంటుంది. ప్రతిరోజూ శ్రీవారికి ఉంజల్ సేవ ఇక్కడ జరుగుతుంది. భగవంతుని సుందర రూపాన్ని నయనానందకరం గా దర్శింపజేసే ఈ ఈమండపాన్ని “సునయన మండపము” అని పిలుస్తారు.

ఈమండపములోనుండి విమానవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్కడే ఒక మనోభీష్ట ఫలకం ఉంది. అక్క శ్రీ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలని ఆ ఫలకం మీద చేతితో రాస్తూ తమ కోరికలను స్వర్ణగిరీశునికి నివేదించవచ్చు. భగవంతుని సన్నిధిలో తమ విన్నపాన్ని సుమనస్సు తో ఏకాగ్రతతో విన్నవిందం భక్తులకు ఒక మరపురాని అనుభవాన్నిస్తుంది. వింత వింతలైన విన్నపాలు వినే ఆ విమాన వెంకటేశ్వరుడు భక్తుల విన్నపాలని వాత్సల్యము తో స్వీకరిస్తాడు.

ఆ ముందుకు నడిస్తే ఈశాన్యభాగం లో ఉండే మండపాన్ని సమాజం లో విభిన్నరంగాలలో ఉండే ముఖ్యమైన గౌరవప్రదమైన వారికోసం VIP ల కోసం కేటాయించారు. కనుక దానికో గౌరవ మండపముఅని నామకరణం జరిగింది.

అక్కడినుండి “రాయగజకేసరి గోపురము” గా పిలువబడే ఉత్తర ద్వారము గుండా బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు “శ్రీ కార్యసిద్ధి హనుమాన్” గా దర్శనమిస్తాడు. 22 అడుగుల హంపి – విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలిఉండే జయద్రధమనే పేరు గల పీట్గం పైన “శ్రీ కార్యసిద్ధి హనుమాన్” అంజలి ముద్రతో కొలువై ఉంటారు.

ఆ వెనుక భాగం లో ఒక పెద్ద కీర్తి స్తంభం, దానిమీద 15 అడుగుల ఎత్తు లో లోహమయ శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. అత్యంత సుందరమైన శ్రీ గరుడుడు సాక్షాత్తూ వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతిసుందర, భీకరమైన రూపం తో అంజలి ముద్రతో నెలవై ఈ స్వర్ణ గిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు.

అక్కడ నుండి ఒకప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళితే

శ్రీవారి ఘంటా మండపము ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన , 1500 కేజీల కాంస్యం తో తయారైన ఒక పెద్ద “జయ గంట” వ్రేలాడుతూ ఉంటుంది. ఆలయం లో విమాన వేంకటేశ్వర స్వామివారి ఎదురుగా స్థాపించిన “మనోభీష్ట ఫలకము” మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పము సిద్ధించిన తర్వాత ఈ జయ గంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయం గానూ, ఆ ప్రతిధ్వని మరింత కమనీయం గానూ వినిపిస్తాయి.

ఆ పక్కనే ఉన్న శ్రీ భూవరహ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి మండపాలను దర్శిద్దాము. ఆ మధ్యలో దీప జ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీప స్తంభాన్ని దర్శించుకుంటూ…,
శ్రీవారి పుష్కరిణి లోనికి ప్రవేశిద్దాము. చూపరును నిబీడాశ్చర్యానికి గురి చేసే అద్భుతమైన ఆలయనిర్మాణ,శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణము కావించబడినది. నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణి కి “ వేద పుష్కరిణి” అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జల నారాయణ స్వామి ప్రతిష్టించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ శయన మూర్తి గా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్ లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరిక్షేత్రం లోకి శ్రీ జల నారాయణ స్వామి విచ్చేశారు.

శ్రీవారి ఆలయం నైరుతి భాగం లో మాడవీధుల లో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్టించబడి ఉంది. ఆత గౌరవానికి, త్యాగ నిరతికి ప్రతీకఅయినా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ మాత మనందరికీ తనఅశీస్సులు నిరంతరం ప్రసాదిస్తూ, శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకై తగిన స్పూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది.

విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్ట దిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడలమీద తిరుమణి శంఖు చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీశుని గోవిందనామాలు భక్తులని సాక్షత్తూ వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతుని కల్గిస్తుంది అనుటలో సందేహం లేదు.

ఈ ఆలయం ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి కరకమలముల మీదుగా, 2024 మార్చ్ 1 వ తేదీనుండి 6 వ తేది వరకు జరుగనున్నాయి. 6 వ తేదీ ఉదయం గం 11-06 నిమిషములకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమము జరుగును. తదుపరి శ్రీవారి శాంతికల్యాణము తో కార్యక్రమాలు సుసంపన్నము కానున్నాయి. కావున భక్తులు అందరూ విచ్చేసి, కార్యక్రమం లో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీ వారి కృపకు పాత్రులు కా గలరని భక్తిపూర్వకం గా ఆహ్వానిస్తున్నాము.

భవదీయులు,
మానేపల్లి కుటుంబము.
మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్.