ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు జారీ

పిటిషన్ పై సమాధానమివ్వాలని అవినాశ్ తో పాటు సీబీఐకి నోటీసులు

supreme-court-issues-notice-to-mp-avinash reddy-in-viveka-murder-case

న్యూఢిల్లీః మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అవినాశ్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేసింది.

గత మంగళవారం అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను రద్దు కోరుతూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌.. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. అయితే సీనియర్‌ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించలేదు. దాంతో సునీతారెడ్డే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సునీత తెలిపారు. దర్యాప్తును పూర్తి చేయడానికి సీబీఐ కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కోరుతోందని, ముందస్తు బెయిల్‌ రావడంతో ఆయన్ను సీబీఐ కస్టడీలో విచారించలేకపోతోందని అన్నారు.