9వ విడత హరితహారం ప్రారంభించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: సిఎం కెసిఆర్ తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సిఎం కెసిఆర్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు.
అనంతరం బీటీఆర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ఎమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది.