వివేకా హత్యకేసు..సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ఈ కేసును ఇంకెంత కాలం విచారిస్తారు?.. సుప్రీంకోర్టు

ssupreme-court-expressed-its-anger-over-the-conduct-of-the-cbi-investigation-in-the-vivekananda-reddy-murder-case

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐని ప్రశ్నించింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశ్యంతో కూడిందేనని రిపోర్టులో రాశారని జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. దీని మీదనే వెళ్తే ఎప్పటికీ శిక్ష పడదు.. హత్యకు గత ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ఆదేశించింది. ‘విచారణాధికారిని మార్చండి… లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 29కి ధర్మాసనం వాయిదా వేసింది.

కాగా, కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని.. దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ.. ఈ హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారం (మార్చి20న ) సుప్రీంకోర్టు విచారించింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారి సరిగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు.