సుప్రీంకోర్టు లో కేసులు వాయిదా ప‌డుతున్న తీరుపై సీజేఐ ఆగ్రహం

Supreme Court cannot become a ‘tareekh pe tareekh court’; will lose trust of people: CJI DY Chandrachud

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లో కేసులు వాయిదా ప‌డుతున్న తీరుపై సీజేఐ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌లో 3688 కేసులు వాయిదాప‌డిన‌ట్లు సీజే డీవై చంద్ర‌చూడ్ తెలిపారు. వాయిదాల మీద వాయిదాలు వేయ‌డం క‌రెక్టు కాద‌న్నారు. ఈరోజు ఒక్క రోజే 178 కేసుల్ని విచార‌ణ నుంచి వాయిదా వేయాల‌ని కోరార‌ని, ఇది న్యాయ వ్య‌వ‌స్థపై ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. కోర్టులంటే వాయిదాలే అన్న విధానాన్ని తీసుకురావ‌ద్దు అని సీజే చంద్ర‌చూడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేగంగా కేసుల్ని ప‌రిష్క‌రించాల‌న్న ప్ర‌క్రియ‌కు ఇది విఘాతంగా మారుతుంద‌న్నారు.

బాలీవుడ్ చిత్రం దామినిలో స‌న్నీ డియోల్ కొట్టిన డైలాగ్‌ను.. ఇవాళ సీజేఐ ఓ కేసు విచార‌ణ స‌మ‌యంలో రిపీట్ చేశారు. ఆ ఫిల్మ్‌లో అత్యాచార బాధితురాలి త‌ర‌పున వాదిస్తూ.. కేసును వాయిదా వేస్తున్న స‌మ‌యంలో.. “తారీక్ పే తార‌కీ” అంటూ హీరో డైలాగ్ కొడుతారు. అయితే నేడు ఓ కేసు విచార‌ణ స‌మ‌యంలో.. సీజే చంద్ర‌చూడ్ కూడా ఆ డైలాగే కొట్టారు. ప‌దేప‌దే కేసుల్ని వాయిదా వేయ‌డం స‌రికాదన్నారు. దీని వ‌ల్ల వేగంగా కేసుల్ని ప‌రిష్క‌రించాల‌న్న త‌మ ల‌క్ష్యం నిర్వీర్యం అవుతుంద‌న్నారు.