వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ ఆత్మహత్యాయత్నం..వేధింపులే కారణమా..?

MGM Hospital, Warangal
MGM Hospital, Warangal

వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ప్రమాదకర ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీనియర్ వైద్యుల వేధింపులే కారణమని అంత మాట్లాడుకుంటున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను తీసుకున్నారు. తోటి వైద్యులు ఇది గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు.

కాగా రెండు రోజుల క్రితం ఒక సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రీతిని వేధించినట్లుగా సమాచారం. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేసిన వైద్యుడిని మందలించారు. అయినప్పటికీ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అసలు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియ రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే ఎస్సైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమెని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తున్నారు.