రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

Sudha Murty nominated to Rajya Sabha by President Murmu

న్యూఢిల్లీః ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోడీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనమని పేర్కొన్నారు.

దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ అన్న మోదీ.. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ఆకాంక్షించారు. 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.