ఆప్ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు

ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఢిల్లీలో విద్యార్థులు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు

students-doing-well-due-to-delhi-government’s-focus-on-education:-lt-governor

న్యూఢిల్లీః ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో విద్యా రంగాన్ని మెరుగుపరచడంపై ఆప్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఢిల్లీలో విద్యార్థులు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారని ప్రశంసించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి.

ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అసెంబ్లీలో ప్రసంగించారు. ఢిల్లీలోని ఆసుపత్రులను నవీకరిస్తున్నారని… దీనికితోడు కొత్త ఆసుపత్రులలో అదనంగా 16 వేల బెడ్స్ చేరుతాయని చెప్పారు. వాస్తవానికి ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రసంగంలో ఆప్ ప్రభుత్వాన్ని లెప్టినెంట్ గవర్నర్ పొగడాల్సి వచ్చింది.