స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం ఫై జనసేన అధినేత దిగ్బ్రాంతి

స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు అగ్నిప్రమాద ఘటనల్లో పలువురు మృతి చెందగా..తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. మృతులను ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణిగా గుర్తించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ మరణించాడు. దట్టమైన పొగకు ఊపిరాడక ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇక ఈ ఘటన ఫై పవన్ కళ్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా దురదృష్టకరం. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించింది. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారని తెలిసింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను అన్నారు.

సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ లో ఇటీవలే ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు. ఇప్పుడు ఈ ప్రమాదం.. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తెలియవలసి ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి దీనివల్ల అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. వీటి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను తనిఖీ చేయడంతోపాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలి. స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. అదే విధంగా కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.