ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కు కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ రావు అలియాస్ రాఘవ కారణమని సూసైడ్ బయటకు వచ్చింది. వనమా రాఘవేందర్ రావు కారణంగానే రామకృష్ణ ఆత్మ హత్య చేసుకున్నట్లు నోట్ దొరకడం తో పోలీసులు వనమా రాఘవేందర్ రావు ఫై కేసు ఫైల్ చేసారు. ప్రస్తుతం ఈయన పరారీలో ఉన్నాడు.

కొత్తగూడెం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణ కూతురిని చూసి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చలించిపోయారు. ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్సై జ్యోతి, ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యలకు కూడా వనమా రాఘవనే కారణమని ఎమ్మెల్యే వీరయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకు రాఘవ ఎన్ని దురాగతాలు చేస్తున్నా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వనమా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వీరయ్య డిమాండ్ చేశారు. అలాగే రాఘవను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే షూట్ చేసి చంపాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదం గురించి మమ్మల్ని ఆశ్రయించారని, వారి ఇష్టపూర్తిగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంబం రావడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ఆయన వెల్లడించారు.

కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు, ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది అంటూ ఆయన విమర్శించారు. నేను ఎలాంటి భూకబ్జాలు, సెటిల్ మెంట్లకు పాల్పడలేదు, రామకృష్ణ ఆత్మహత్య విషయంలో పార్టీ అధిష్టానం వివరణ కోరలేదు, వివరణ అడిగితే నేను తప్పకుండా చెబుతాను అంటూ స్పష్టం చేశారు.